*పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు*

‘నీవే నా దేవుడవు. దయగల నీ *ఆత్మ నన్ను నడిపించును* గాక.’
కీర్త. 143:10.

మీరు ఎప్పుడైనా సముద్రంలో ఓడ ప్రయాణం చేశారా? ఓడ ఏ దిక్కునకు పోవుచున్నదో  నావికుడు ఎలా తెలుసుకొన గలడు? అందుకు వారు ఉపయోగించే సాధనమే
*దిక్సూచి.*

ఈ అయస్కాంత దిక్సూచి దిశను సూచించే ఒక సాధారణ పరికరం. దానిలో ఉండే అయస్కాంతపు ముల్లు అదృశ్యముగా ఉన్న అయస్కాంతపు శక్తి వల్ల దానంతటదే కదులుతూ ఎప్పుడూ ఉత్తర దిక్కునే చూపిస్తుంది.

సముద్ర మార్గాన ప్రయాణిస్తున్నప్పుడు దారి కనుక్కోవడానికి ప్రజలు ఎన్నో శతాబ్దాలుగా దిక్సూచిని ఉపయోగిస్తున్నారు.

అదే విధంగా ఈ లోకమనే సముద్రంలో *విశ్వాసులను నడిపించుటకు* ఆత్మ దేవుడు తన గొప్ప శక్తిని ఉపయోగిస్తున్నాడు.
మనకు నడిపింపునిచ్చే ప్రాముఖ్యమైన పరిశుద్ధాత్మ దేవుని శక్తిని గురించిన కొన్ని విషయాలను వరుస పాఠాలలో నేర్చుకుందాం.

ఆదికాండం మొదటి అధ్యాయం నుండి ప్రకటన గ్రంధం చివరి అధ్యాయం వరకు *పరిశుద్ధాత్మదేవుని నడిపింపు* ఉన్నది.

ఆది 1:1,2లో దేవుడు చేసినదాని గురించి ఆదికాండము ఇలా చెబుతోంది, “ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.” అలా సృష్టించడానికి ఆయన గొప్ప ఆత్మ శక్తిని ఉపయోగించాడు. అందుకే, *“దేవుని ఆత్మ* జలములపైన అల్లాడు చుండెను” అని సృష్టిని గురించిన వృత్తాంతం చెబుతోంది. (ఆది. 1:1, 2)

బైబిల్ చివరి వచనాలలో కూడా ఆత్మ దేవుని గురించి చూడగలం. ప్రక 22:17 *ఆత్మయు* పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పు చున్నారు; 
  
అవును, సమస్త సృష్టిని చేయడానికి నడిపించడానికి దేవుడు ఉపయోగించినది ఆత్మదేవుని అద్భుతమైన శక్తినే. ఆత్మ దేవుడు తన శక్తిని ఉపయోగించి మనకు జీవాన్ని ఇచ్చినందుకు, మిగతా సృష్టిని చేసినందుకు మనం ప్రభువుకు ఎల్లపుడు కృతజ్ఞత చూపించాలి. ఆది 2:7 దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు *జీవాత్మ* ఆయెను.

యోబు 33:4 దేవుని ఆత్మ నన్ను సృజించెను సర్వశక్తుని యొక్క *శ్వాసము నాకు జీవమిచ్చెను;*  కీర్త. 104:30 నీవు *నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును* అట్లు నీవు భూతలమును నూతనపరచుచున్నావు.

యేహెజ్కేలు 37:10  ఆయన నా కాజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా *జీవాత్మ* వారిలోనికి వచ్చెను; వారు సజీవులై లేచి లెక్కింప శక్యముకాని మహా సైన్యమై నిలిచిరి.

ఒక తల్లి తన బిడ్డకు జన్మ ఇచ్చి జీవంపోసినందుకు ఆ తల్లి తన బిడ్డకు తోడుగా ఉండి జీవితాంతం బిడ్డను నడిపించాలని కోరుకుంటుంది. అదే విధంగా ఆత్మ దేవుడు తల్లి మాదిరిగా తన శక్తిని ఉపయోగించి మనకు జీవాన్నిచ్చాడు కాబట్టి ఆత్మ దేవుడు అదే శక్తి ద్వారా తన బిడ్డలను చివరి వరకు నడిపించాలని చూస్తున్నాడు.

అందుకే *‘ఆత్మ మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును’* అని ఆయన తన శిష్యులతో చెప్పాడు. (యోహా. 16:13) యేసు ఇక్కడ ఏ ఆత్మ గురించి మాట్లాడుతున్నాడో మనం గ్రహించాలి మరియు ఆ పరిశుద్దాత్ముని శక్తి మనల్ని నడిపించాలని మనం కోరుకోవాలి.

ఇంతకీ పరిశుద్ధాత్మ దేవుని శక్తి అంటే ఏమిటి? వాయువు లేదా గాలి కంటికి కనిపించక పోయినా దాని ప్రభావం మనకు తెలుస్తుంది. అలాగే పరిశుద్ధాత్మ దేవుని శక్తి మన కంటికి కనిపించక పోయినా ఆ శక్తి ఎన్నో పనులు జరగడానికి తోడ్పడుతుంది.

యెషయా 40:12, 13  తన పుడిసిటిలో జలములు కొలిచినవాడెవడు? జేనతో ఆకాశముల కొల చూచిన వాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచినవాడెవడు? త్రాసుతో పర్వతములను తూచినవాడెవడు? తూనికచేత కొండలను తూచినవాడెవడు? *యెహోవా ఆత్మకు* నేర్పినవాడెవడు? ఆయనకు  మంత్రియై  ఆయనకు  బోధపరచినవాడెవడు?  ఎవనియొద్ద ఆయన ఆలోచన అడిగెను?

ఆత్మ దేవుడు తన శక్తితో గొప్ప కార్యములు చేస్తాడని పాతనిబంధన భక్తులకు కూడా తెలుసు. అందుకే దావీదు తన జీవితంలో *దేవుని ఆత్మ నడిపింపును కోరుకున్నాడు.*

దేవుడు జీవితాంతం తన ఆత్మ శక్తితో నడిపిస్తానని ఆయన కీర్తనకర్తయైన దావీదుకు ఇలా వాగ్దానం చేశాడు, “నీకు ఉపదేశము చేసెదను. నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను.” (కీర్త. 32:8)

దావీదు తనకు అలాంటి నడిపింపు కావాలని కోరుకున్నాడు, అందుకే ఆయన యెహోవాను ఇలా వేడుకున్నాడు, ‘నీవే నా దేవుడవు. నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. *దయగల నీ ఆత్మ నన్ను నడిపించును గాక.’* (కీర్త. 143:10)

దావీదుకు ఉన్నట్లే మనకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించాలనే కోరిక ఉండాలి. ఈ వరుస పాఠాలలో ముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుని గురించి మూడు  విషయాలు నేర్చుకుందాం.

*A.పరిశుద్దాత్మ నడిపింపు* అవసరాన్ని తెలియజేయు నాలుగు కారణాలు

*B. పరిశుద్ధాత్మ నడిపింపు* పొందుకునే విధానాలు

*C. పరిశుద్ధాత్మ నడిపింపు* ద్వారా కలుగు 7 మేలులు (ధన్యతలు)

*పరిశుద్ధాత్మ నడిపింపు*

దావీదు యెహోవాను ఇలా వేడుకున్నాడు, ‘నీవే నా దేవుడవు. నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల *నీ ఆత్మ నన్ను నడిపించును గాక.*’ కీర్త. 143:10

దావీదుకు ఉన్నట్లే మనకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించాలనే కోరిక ఉండాలి.

పరిశుద్ధాత్మను గురించి *మూడు  విషయాలు* నేర్చుకుందాం.

A.పరిశుద్దాత్మ నడిపింపు అవసరాన్ని తెలియజేయు నాలుగు కారణాలు

B. పరిశుద్ధాత్మ నడిపింపును పొందుకునే విధానాలు

C. పరిశుద్ధాత్మ నడిపింపును ద్వారా కలుగు మేలులు (ధన్యతలు)

*A. పరిశుద్దాత్మ నడిపింపు అవసరాన్ని తెలియజేయు నాలుగు కారణాలు:* ఈ నాలుగు కారణాలలో మొదటి కారణాన్ని ఈ దినం ధ్యానం చేద్దాం.

*A1.మొదటి కారణం - స్వనీతి ద్వార మనల్ని మనం నిర్దేశించుకోలేం:*

పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించాలని మనం కోరుకోవడానికి గల *మొదటి కారణం* ఏమిటంటే, మన స్వనీతితో  జీవితాల్ని నిర్దేశించుకునే సామర్థ్యం మనకు లేదు.

దేవుని ఆత్మ సహాయం లేకుండా మనల్ని మనం నిర్దేశించుకోలేం. ఈ దుష్ట లోకంలో మన జీవితాల్ని సొంతంగా స్వనీతితో నిర్దేశించుకోవడానికి ఎందుకు ప్రయత్నించకూడదో పరిశీలన చేద్దాం.

ఎందుకంటే దేవుడు మనల్ని ఆ సామర్థ్యంతో సృష్టించలేదు, ముఖ్యంగా ఈ అపరిపూర్ణ స్థితిలో మనమలా చేయలేం. మనిషి త్రోవ తన వశములో లేదని మనిషికి తెలుసు. తన అడుగులు సరిగా వేయడం కూడా మనిషి తరం కాదు.

యిర్మీయా ప్రవక్త ఇలా రాశాడు, (యిర్మీ. 10:23, యెహోవా, తమ మార్గము నేర్పరచుకొనుట నరుల వశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును.)

ఎందుకు మనల్ని మనం నిర్దేశించుకోలేమో తెలియజేస్తూ దేవుడు యిర్మీయా ద్వారా ఇలా చెప్పాడు, (“హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికలది, దాని గ్రహింపగలవాడు ఎవడు?”—యిర్మీ. 17:9; మత్త. 15:19.)

ఒకవేళ మన స్వంత నీతితో సామర్థ్యంతో ఈలోకంలో నడవాలని ప్రయత్నించినా అది మూర్ఖత్వమవుతుంది గానీ ఉపయోగంలేదు. ఒక ఉదాహరణ చూద్దాం.

ఒక వ్యక్తి తనకు దారి అంతగా తెలియని సూర్య కాంతి కనబడని ఒక భయంకరమైన కీకారణ్యం గుండా వెళ్తున్నాడనుకుందాం. దారి తెలిసిన వ్యక్తి తోడు లేకుండా, అయస్కాంత దిక్సూచి లేకుండా ఒంటరిగా వెళ్లడం మూర్ఖత్వమే అవుతుంది. అలాంటి ప్రదేశంలో ఎలా వెళ్ళాలో, అక్కడనుండి సురక్షితంగా ఎలా బయటపడాలో తెలియకపోతే అతని ప్రాణానికే ప్రమాదం.

అలాగే ఈ దుష్ట లోకం ఒక భయంకరమైన అడివి. అటువంటి ఈ లోకంలో దారి తెలియజేసే అయస్కాంత దిక్సూచి వంటి ఆత్మ దేవుని నడిపింపును అనుసరించకుండా తమ సొంత నీతితో, సామర్థ్యంతో తమ జీవితాల్ని నిర్దేశించుకోగలమని అనుకునేవాళ్ళ ప్రాణాలు కూడా ఘోరమైన ప్రమాదంలో పడతాయి. అందుకే ఈదినాలలో అనేకుల జీవితాలు మరణకరమైన పరిస్థితులలో ఉన్నాయి.

మన స్వంత నీతి అనగా శరీర సంబంధమైన మనస్సు *మనలను మరణానికి నడిపిస్తుంది.* రోమా 8:5లో పౌలు ఇలా అంటున్నాడు. శరీరానుసారులు శరీరవిషయముల మీద మనస్సు నుంతురు; *ఆత్మానుసారులు ఆత్మవిషయముల మీద మనస్సునుంతురు*; శరీరాను సారమైన మనస్సు మరణము;

చిన్నకుమారుడు స్వంతంగా నడవాలని ప్రయత్నించి చివరకు పందుల దగ్గరకు చేరాడు. *"ఆకలితో చచ్చి పోతున్నానని అంటున్నాడు."* అనగా మరణకరమైన పరిస్థితిలోనికి చేరుకున్నాడు. దీనిని బట్టి ఏమి అర్ధమౌతుంది?

ఆత్మను త్రోసివేసి ఒకవేళ మన జీవితాలను మనమే మన స్వంత నీతితో నడిపించుకోవాలని ప్రయత్నించడం ప్రమాదకరం. ఈ క్రింది కారణాలను బట్టి దారితప్పిన వారమవుతాం.

1. మన స్వనీతి  పాపపు పనులను నిర్లక్యం చేసి మంచి పనులను బట్టి ఉప్పోగుతుంది. లోపలి స్థితిని నిర్లక్యం చేసి, బయటికి కనిపించే సాక్షం మీదే దృష్టి ఉంచుతుంది.

2 .మన స్వనీతి ప్రక్కన వారితో పోల్చుకొని, నేను వారికంటే బాగున్నానని గర్విస్తూ లోలోపలే చిన్న చూపు చూస్తుంది. భూసంబంధమైన వనరులను అనగా డబ్బు, హోదా, ఆస్తిపాస్తులు, లోకఙ్ఞానం మరియు లేఖన ఙ్ఞానం  దైవ ఆశీర్వాదాలుగా భావిస్తుంది.

3. మన స్వనీతి మనుషుల దగ్గర మెప్పు కోరుకుంటుంది. దేవుని స్నేహాన్ని ఆయన మనస్సుని నిర్లక్యం చేస్తుంది.

4. మన స్వనీతి జ్ఞానాన్ని బట్టి గర్విస్తుంది. నేర్చుకొనే మనస్సు పోతుంది. ఈలాంటి స్థితి నాది కాదు మరొకరిది అనుకుంటుంది.

5. మన స్వనీతి దేవుని కృప నుండి తొలగింపజేసి అనగా నిర్లక్యం చేసి, దైవోగ్రతలోకి ప్రవేశింపజేస్తుంది.

6. మన స్వనీతి మనుషుల దగ్గర మెప్పు కోరుకుంటుంది.

7. మన స్వనీతి వలన మనలను మనం నడిపించుకోవడానికి చేసే క్రియలు మురికి గుడ్డలు వంటివని మనం తెలుసుకోలేము.

కాబట్టి మనం దావీదులాగే యెహోవాను ఇలా వేడుకోవాలి.

కీర్త. 25:4 యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము, నీ త్రోవలను నాకు తేటపరచుము.”

కీర్త 23:3 నా ప్రాణమునకు ఆయన సేదదీర్చు చున్నాడు తన నామమునుబట్టి *నీతి మార్గములలో నన్ను నడిపించు చున్నాడు.*

అలాంటి నడిపింపును మనము ఆత్మదేవుని ద్వారా పొందవచ్చు.అడుగువారికి దేవుడు తన ఆత్మను సమృద్ధిగ అనుగ్రహించువాడు.

లూకా 11: 13 దేవుడు తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను.

పరిశుద్దాత్మ నడిపింపు అవసరాన్ని తెలియజేయు రెండవ కారణం
A2 - లౌకికాత్మ మనల్ని తప్పుదారి పట్టిస్తుంది కనుక మనం పరిశుద్ధాత్మ నడిపింపునో

పరిశుద్ధాత్మ నడిపింపు

1 కొరిం. 2:12 దేవునివలన మనకు దయ చేయబడిన వాటిని తెలిసికొనుటకై మనము *లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు _ఆత్మను_ పొంది యున్నాము.*

పరిశుద్దాత్మ నడిపింపు అవసరాన్ని తెలియజేయు   కారణాల గురించి ధ్యానం చేస్తున్నాం. దీనిలో భాగంగా
మన స్వనీతి ద్వార మనల్ని మనం నిర్దేశించుకోలేం గనుక మనకు ఆత్మ నడిపింపు కావలసి యున్నదని మొదటి కారణం చూశాం. ఇప్పుడు రెండో కారణాన్ని చూద్దాం.

*A2. రెండవ కారణం- లౌకికాత్మ మనల్ని తప్పు దారి పట్టిస్తుంది కనుక పరిశుద్ధాత్మ నడిపింపు మనకు అవసరమై యున్నది.*

లౌకికాత్మ మనల్ని తప్పు దారి పట్టిస్తుంది: పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించాలని మనం కోరుకోవడానికి గల రెండవ కారణం ఏమిటంటే,

పరిశుద్ధాత్మ సహాయం లేకపోతే లౌకికాత్మ మనల్ని తప్పుదారి పట్టించే ప్రమాదం ఉంది. నేడు లోకంలోని చాలామంది ఆ లౌకికాత్మ చెప్పుచేతల్లోనే ఉన్నారు. లౌకికాత్మ ప్రేరణ ద్వారా మనుష్యులు  అతిక్రమాలలో పాపాలలో చచ్చినవారుగా ఉండి, లోకస్తుల పోకడలో నడుచుకొంటూ లోకం పోకడనూ, వాయుమండల రాజ్యాధికారినీ – అంటే, క్రీస్తుపట్ల విధేయత లేనివారిలో పని చేస్తూ ఉన్న సాతాను  ఆత్మను అనుసరించి నడుచుకొనేవారుగా ఉన్నారు. 

లోకం పోకడ మనలను పరిశుద్ధాత్మ నడిపింపుకు విరుద్ధంగా ప్రవర్తించేలా చేస్తుంది. అది ప్రజల్లో క్రీస్తు మనసును పెంపొందించే బదులు ఈ లోక పరిపాలకుడైన సాతానులా ఆలోచించేటట్లు, ప్రవర్తించేటట్లు చేస్తుంది.

ఎఫెసీయులు 2:1-3 మీ అపరాధములచేతను పాపములచేతను మీరు చచ్చినవారై యుండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడ బ్రదికించెను. 2  మీరు వాటిని చేయుచు, వాయు మండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి *అధిపతిని అనుసరించి*, యీ ప్రపంచ ధర్మముచొప్పున మునుపు నడుచుకొంటిరి. 3  వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమ వారివలెనే స్వభావసిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై యుంటిమి.

తీతు 3:3 ఎందుకనగా మనము కూడ మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానావిధములైన దురాశలకును భోగములకును దాసులమునైయుండి, దుష్టత్వమునందును అసూయ యందును కాలము గడుపుచు, అసహ్యులమై యొకని నొకడు ద్వేషించుచు ఉంటిమి.

ఒక వ్యక్తి లౌకికాత్మకు లొంగిపోయి శరీరకార్యాలు చేయడం మొదలుపెడితే అతనికి ఘోరమైన పరిణామాలు ఎదురౌతాయి, చివరకు అతను దేవుని రాజ్యంలో ప్రవేశించ లేకపోవచ్చు.

గల. 5:19-21 శరీర కార్యములు స్పష్టమై యున్నవి. ఉదాహరణ- చిన్న కుమారుడు *లౌకిక ఆత్మ* చేత నడిపింపబడి నాశనమయ్యాడు.

ఉదాహరణ “బిలాము”. మొదటి శతాబ్దంలో క్రైస్తవత్వాన్ని విడిచిపెట్టిన వాళ్ళు “తిన్నని మార్గమును విడిచి . . . త్రోవ తప్పిపోయిరి” అని అపొస్తలుడైన పేతురు రాశాడు.

2 పేతు. 2:15 తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమునుబట్టి త్రోవ తప్పిపోయిరి.

మనం దేవుని సహాయంతో మాత్రమే ఈ లౌకికాత్మను ఎదిరించి విజయం సాధించవచ్చు. లౌకికాత్మను ఎదిరించడానికి దేవుడు మనల్ని సిద్ధం చేశాడు.

ఎఫె. 6:10, ‘ప్రభువు యొక్క మహా శక్తినిబట్టి ఆయన యందు బలవంతులై యుండుడి.  13 అప్పుడు మీరు ఆపద్దినమందు నిలువబడుటకు శక్తిమంతులగుదురు’ అని అపొస్తలుడైన పౌలు చెప్పాడు.

మనల్ని తప్పుదారి పట్టించేందుకు సాతాను చేసే ప్రయత్నాల్ని తట్టుకొని నిలబడడానికి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని బలపరుస్తాడు. లౌకికాత్మ చాలా శక్తివంతమైనది, దాని బారినపడకుండా మనం పూర్తిగా తప్పించుకోలేం.

ప్రక. 12:9 కాగా సర్వ లోకమును మోసపుచ్చుచు, అపవాదియనియు సాతాననియు పేరుగల ఆదిసర్పమైన  ఆ మహా ఘటసర్పము పడద్రోయ బడెను.

కానీ దాన్ని ఎదిరించవచ్చు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని శక్తి లౌకికాత్మ కంటేకూడా శక్తివంతమైనది, మనకు సహాయం చేస్తుంది.

“లౌకికాత్మను కాక దేవుని యొద్దనుండి వచ్చు ఆత్మను” పొందినందుకు మనమెంత కృతజ్ఞులమో కదా!

1 కొరిం. 2:12 దేవునివలన మనకు దయ చేయబడిన వాటిని తెలిసికొనుటకై మనము *లౌకికాత్మను* కాక *దేవుని యొద్దనుండి వచ్చు ఆత్మను* పొంది యున్నాము.

ఆ ఆత్మ సహాయం తీసుకొని, ఆధ్యాత్మికంగా మనల్ని సరైన మార్గంలో నడిపించడానికి ప్రభువు చేసిన ఏర్పాట్లను పూర్తిగా ఉపయోగించుకుంటే ఈ దుష్టలోకంలోని సాతాను ఆత్మను ఎదిరించగలుగుతాం.—గల. 5:16.

దేవుని ఆత్మ మనము లౌకికాత్మను ఎదిరించుటకు సహాయము చేయడమే కాకుండ ఈ క్రింది విషయాలలో కూడా సహకారిగా ఉండగలదు.

దేవుని నీతి (ఆత్మ సంబంధమైన మనస్సు) మనలను నడిపినపుడు

1. మన క్రియలు దేవుని దృష్టిలో మురికి గుడ్డలు వంటివని గుర్తించి (దేవుని వాక్యాన్ని నమ్మి) తప్పుడు జీవితాన్ని బట్టి దుఃఖించి, దేవుని ముందు నిల్చొని ఆయన కరుణను వేడుకొనగలం.

2. దేవుని ఆత్మ మనలాంటి వారిని అర్థం చేసుకొని కృప చూపిస్తుంది మరియు వారికి సహాయం చేస్తుంది .

3. మనుషుల దగ్గర మెప్పు కంటే, దేవుని మెప్పును కోరుకుంటాము. ఈ లోకం చేత ద్వేషించబడినా ధైర్యంగా ఉండగలము.

4. దేవుని యొక్క శక్తిని అనుభవపూర్వకంగా తెలుసుకొనగలము. దైవ స్వరాన్ని గుర్తించగలము, నేర్చుకుంటాము (వయస్సు , తెలివితేటలూ, స్థితిగతులను పట్టించుకోము). దైవచూపుతో మనుష్యులను, పరిస్థితులను చూడగలము.

5. క్రీస్తు(సిలువ బలియాగం)లో విశ్వాసముంచి, విమోచకుణ్ణి ఆశ్రయించి, కృపలో ప్రవేశించి (నిలిచివుండి) దేవుని నీతిని పొందుకొనగలము. రక్షణలో ప్రవేశించగలము.

6. దేవుని ఆత్మ ద్వార ఆత్మానుసారముగా జీవితంలో నడుచు కొంటాము,

7. అప్పుడు శరీరేచ్ఛను ఎటువంటి పరిస్థితులలో నెరవేర్చము. దేవుడే మనలను
నడిపిస్తాడని ఒకే స్థిరమైన ఆశగలిగి యుండగలము.

ఈజీవిత యాత్రలో ఏన్నో తుఫానులు ఎదురై గుండెను పిండేస్తున్నా ప్రభువుయొక్క ఆత్మ తప్ప మనకు ఇలలో ఎవరూ సహాయం చేసేవారు లేరని ఆయనే మనలను ఆదరించువాడని ఆదుకొనేవాడని అద్దరికి చేర్చువాడని గ్రహించగలం.

కాబట్టి ప్రియులారా! లౌకికాత్మ మనల్ని తప్పు దారి పట్టిస్తుంది కనుక పరిశుద్ధాత్మ నడిపింపు మనకు అవసరమై యున్నది గ్రహించుకుందాం. దేవుడు మిమ్ములను దీవించునుగాక ఆమేన్

*పరిశుద్ధాత్మ నడిపింపు*

*ఆత్మచేత నడిపించబడిన యేసు*

లూకా 4:1  యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యొర్దానునదినుండి తిరిగి వచ్చి, నలువది దినములు *ఆత్మచేత అరణ్యములో నడిపింప బడెను*

*A3. పరిశుద్ధాత్ముని నడిపింపు మన జీవితంలో ఎందుకు అవసరమో మనకు తెలియజేయు మూడవ  కారణం* – పరిశుద్ధాత్మచే యేసు నడిపించబడ్డాడు కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కూడా  నడిపించాలని మనం కోరుకోవాలి. దేవుడు తన సొంత కుమారుణ్ణే పరిశుద్ధాత్మతో నడిపించాడు.

పరిశుద్ధాత్మ నడిపింపును అంగీకరించే విషయంలో యేసు మనకు మాదిరిగా ఉన్నాడు. మానవునిగా ఉన్నప్పుడు యేసు జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు ఎంత శక్తివంతంగా పనిచేసినవో బైబిలు చెబుతోంది. ఆయన పరిశుద్ధాత్మ దేవుని నడిపింపును కోరుకున్నాడు, ఆ ఆత్మ ఏదైనా పని చేయమని నిర్దేశించినప్పుడు ఆయన దాన్ని అంగీకరించి దాని ప్రకారమే చేశాడు.

(మార్కు 1:12 వెంటనే *పరిశుద్ధాత్మ ఆయనను* అరణ్యములోనికి త్రోసికొని పోయెను; లూకా 4:14 అప్పుడు యేసు, *ఆత్మ బలముతో* గలిలయకు తిరిగి వెళ్లెను;)

దేవుని అద్వితీయ కుమారునికి భూమ్మీదకు రాకముందే ఈ ప్రవచనం గురించి తెలుసు, “యెహోవా ఆత్మ, జ్ఞానవివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవాయెడల భయభక్తులను పుట్టించు *ఆత్మ అతనిమీద నిలుచును.*” (యెష. 11:2)

ఆ ప్రవచనంలోని యెహోవా మాటలు నెరవేరాయి.
యేసు బాప్తిస్మం తీసుకున్న వెంటనే ‘పరిశుద్ధాత్మ పూర్ణుడై యొర్దాను నది నుండి తిరిగి వచ్చి, నలువది దినములు *ఆత్మచేత అరణ్యములో నడిపింపబడ్డాడు’* అని సువార్త వృత్తాంతం చెబుతోంది. (లూకా 4:1)

యేసు దేవునికి పరిశుద్ధాత్మ సహాయం అవసరం లేకపోయినా తాను మానవ శరీరంలో ఉన్నాడు కనుక మరియు మనకు మాదిరి చూపించుటకు ఆయన ఆత్మ దేవుని సహాయం తీసుకున్నాడు.

యేసు భూమ్మీద ఉన్నప్పుడు తాను ఎదుర్కొన్న పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ సహాయంతోనే అనేక కార్యాలు చేశాడు.
అందుకే యేసు పరిశుద్ధాత్మ సహాయం కోసం వేడుకోవడం, ఆత్మ నడిపింపును పొందడం ఎంత ప్రాముఖ్యమో తన శిష్యులకు కూడా తెలియ జేశాడు.

(లూకా11:13 పరలోకమందున్న మీతండ్రి తన్ను అడుగువారికి *పరిశుద్ధాత్మను* ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను.)

కనుక మనకు పరిశుద్ధాత్మ సహాయం అవసరం. ఎందుకంటే ఆత్మదేవుడు  మన ఆలోచనావిధానాన్ని సరిచేస్తాడు, అప్పుడు మనం కూడా క్రీస్తు మనసును కలిగివుండగలుగుతాం.

(రోమా. 12:2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక,  ఉత్తమమును,  అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి.;
1 కొరిం. 2:16 ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగినవారము.)

పరిశుద్దాత్మ యేసు క్రీస్తు జీవితంలో జరిగించిన కార్యములు:

1.     యేసు జన్మ వృత్తాంతంలో...

•లూకా 1:35  దూత -పరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశివు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును.

2. యేసు బాప్తీస్మ సందర్భంలో ఆయన పరిశుద్దాత్మ చేత అభిషేకించ బడెను:

•మత్త 3:16  యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డుకు వచ్చెను; అప్పుడు ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తన మీదికి వచ్చుట చూచెను.

•హెబ్రీ 1:9  నీవు నీతిని ప్రేమించితివిదుర్ణీతిని ద్వేషించితివిఅందుచేత దేవుడు నీ దేవుడు నీతోటివారికంటెనిన్ను ఎక్కువగా ఆనంద తైలముతో అభిషేకించెను.

3.     యేసు పరిశుద్దాత్మ చేత ముద్రించబడెను:

•యోహ 6:27  క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్యజీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి; మనుష్య కుమారుడు దాని మీకిచ్చును, ఇందుకై తండ్రియైన దేవుడు ఆయనకు ముద్రవేసి యున్నాడని చెప్పెను.

4.యేసు సువార్త ప్రకటన విషయంలో పరిశుద్దాత్మ శక్తి చేత బోధించెను:

•లూకా 4:18-19. ప్రభువు ఆత్మ నామీద ఉన్నదిబీదలకు సువార్త ప్రకటించుటకైఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్నవారికి విడుదలను గుడ్డివారికి చూపును (కలుగునని) ప్రకటించుటకును నలిగినవారిని విడిపించుటకును ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు.

5. యేసు పరిశుద్దాత్మ చేత అద్భుతములను స్వస్థతలను చేసెను:

•మత్త 12:28  దేవుని ఆత్మవలన నేను దయ్యములను వెళ్లగొట్టుచున్న పక్షమున నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చియున్నది.

•అపో 10:38  అదేదనగా, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెననునదియే. దేవుడాయనకు తోడై యుండెను గనుక ఆయన మేలు చేయుచు, అపవాదిచేత పీడింపబడినవారినందరిని స్వస్థపరచుచు సంచరించుచుండెను. 

6. యేసు పరిశుద్దాత్మ లో దుఖ్ఖించెను:

•యోహ 11:33  ఆమె యేడ్చుటయు, ఆమెతో కూడ వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు – అతని నెక్కడనుంచితిరని అడుగగా,

7. యేసు పరిశుద్దాత్మ లో ఆనందించెను:

•లూకా 10:21  ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి – తండ్రీ ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను; అవును తండ్రీ, ఆలాగు నీ దృష్టకి అనుకూలమాయెను.

8. యేసు పరిశుద్దాత్మ చేత తన్ను తాను సిలువ మరణమునకు ఆప్పగించుకొనెను:

•హెబ్రీ 9:14  నిత్యుడగు ఆత్మద్వారా తన్నుతాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తుయొక్క రక్తము, నిర్జీవక్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీమనస్సాక్షిని ఎంతో యెక్కవగా శుద్ధిచేయును.

9. యేసు పరిశుద్దాత్మ చేత మృతులలో నుండి లేపబడెను:

•రోమా 1:4 యేసు క్రీస్తు, శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలోనుండి పునరుత్ధానుడైనందున పరిశుద్దమైన ఆత్మనుబట్టి ప్రభావముచేత దేవుని కుమారుడుగాను నిరూపింపబడిన వాడాయెను.

•1పేతు 3:18  ఏలయనగా మనలను దేవునియొద్దకు తెచ్చుటకు, అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీరవిషయములో చంపబడియు, ఆత్మ విషయములో బ్రదికింపబడి, పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను.

10.  యేసు పరిశుద్దాత్మ ద్వారా తన అపోస్తలులకు సువార్త ప్రకటన విషయమై ఆజ్ఞాపించెను:

•అపో 1:1-2. ఓ థెయొఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపొస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినమువరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటినిగూర్చి నా మొదటి గ్రంథమును రచించితిని.

యేసు జీవితాన్ని అత్యద్భుతంగా నడిపించిన పరిశుద్ధాత్మను మన జీవితాల్ని నడిపించడానికి కూడా ఆహ్వానించడం ద్వార మనం క్రీస్తు మాదిరిని అనుకరిస్తాం.—1 పేతు. 2:21. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తుకూడ మీకొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచి పోయెను.

పరిశుద్ధాత్మ ద్వార మంచి లక్షణాల్ని మనలో దేవుడు  పెంపొందించగలడు.

*పరిశుద్ధాత్మ నడిపింపు*

*ఆత్మ నడిపింపు వలన మనము దేవుని కుమారులుగా మారుదుము*

రోమా 8:14  దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులై యుందురు.

పరిశుద్ధాత్మ మనల్ని నడిపించాలని కోరుకోవడానికి గల కారణాలను మనం ధ్యానిస్తున్నాము.

A1- మొదటి కారణం, మనలను మనం ఈ లోకంలో నడిపించుకోలేము,
A2- రెండవ కారణం ఈలోకంలో లౌకికాత్మ బలంగా పనిచేయుచున్నది,
A3- మూడవ కారణం యేసు ప్రభువే పరిశుద్ధాత్మ నడిపింపుకు లోబడ్డాడు కనుక అది మనకు మాదిరికరము. ఇప్పుడు నాల్గవ కారణం చూద్దాం.

A4- నాల్గవ  కారణం –  పరిశుద్ధాత్మ మనల్ని నడిపించాలని మనం కోరుకోవడానికి గల నాలుగవ కారణం ఏమిటంటే, మనము దేవుని కుమారులుగా చేయబడుట కొరకు పరిశుద్దాత్మ నడిపింపు మనకు అవసరమై యున్నది.

(రోమా 8:14  దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులై యుందురు.)

దేవుని కుమారులు అనగా దేవుని లక్షణాలు గలవారముగా పరిశుద్దాత్మ నడిపింపులో మనం తయారు కాగలం. పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి, ఆయన వ్యక్తిత్వంలోని లక్షణాలను మనకు రాగలవు. ఆ దేవుని లక్షణాలే ఆత్మ ఫలము.

ఆత్మ ఫలము అనునది పరలోకానికి తలుపు లాంటిది. ఈ లక్షణాలు లేకుండా మనకు తలుపు తెరవబడదు.

(గలతీయులు 5:22, అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయా ళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము.)

మరింత ప్రేమగా, సంతోషంగా, సమాధానంగా ఉండాలని మనలో ఎవరం మాత్రం కోరుకోం? దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం ఇంకా ఎక్కువగా చూపించాలని మనలో ఎవరం మాత్రం ఇష్టపడం? విశ్వాసం, సాత్వీకం, ఆశానిగ్రహం మరింత బాగా పెంపొందించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల్ని ఎవరం మాత్రం కాదనుకుంటాం?

మనకు, మన కుటుంబ సభ్యులకు, ఇతరులకు, తోటి సహోదరులకు ప్రయోజనం చేకూర్చే మంచి లక్షణాల్ని పరిశుద్ధాత్మ మనలో పెంపొందేలా చేస్తుంది. అయితే వాటిని పెంపొందించుకునేందుకు మనం కృషి చేస్తూనే ఉండాలి. అలా మనం ఎన్ని మంచి లక్షణాలనైనా పెంపొందించుకోవచ్చు.

(కొలొ. 3:9 ఒకనితో ఒకడు అబద్ధ మాడకుడి;ఏలయనగా ప్రాచీనస్వభావమును దాని క్రియలతో కూడ  10 మీరు పరిత్యజించి, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించినవాని పోలికచొప్పున నూతన పరచబడుచున్న నవీనస్వభావమును ధరించుకొని యున్నారు.)

దేవుణ్ణి అనుకరించేందుకు కృషిచేయడానికి గల ప్రాముఖ్యమైన కారణాన్ని యేసు తన అపొస్తలులతో మాట్లాడుతున్నప్పుడు సూచించాడు. ఆయనిలా అన్నాడు: “మీరు బహుగా ఫలించుటవలన నా త౦డ్రి మహిమపరచబడును.” యోహా. 15:8

మనం ‘ఆత్మ ఫలాన్ని’ అలవర్చుకుంటున్నప్పుడు అది మన మాటల్లో, చేతల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అలా మనం దేవుని మహిమ పరుస్తాం.

(మత్త. 5:16 మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యు)

ఆత్మ ఫలంలోని లక్షణాలకు, సాతాను ప్రపంచంలోని లక్షణాలకు మధ్య చాలా తేడాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ నడిపింపును అనుసరించే వాళ్ళలో దేవుడు తన లక్షణాల్ని పెంపొందిస్తాడు.

ఆత్మఫలంలోని లక్షణాలను సాధ్యమైనంత ఎక్కువగా పెంపొందించుకోవడానికి మనం ఆత్మ నడిపింపును అనుసరించాలి.
మన మాటలు, మన పనులు మన పరిశుద్ధాత్మ నడిపింపును అనుసరిస్తున్నామని, మంచి లక్షణాల్ని పెంపొందించుకుంటున్నామని చూపిస్తున్నాయా లేదా అని పరిశీలించుకోవడం మంచిది.

(2 కొరిం. 13:5 మీరు విశ్వాసము గలవారై యున్నారో లేదో మిమ్మును  మీరే  శోధించుకొని  చూచు కొనుడి; మిమ్మును మీరే పరీక్షించుకొనుడి;  గల. 5:25 మనము ఆత్మ ననుసరించి జీవించువారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందము.)

పరిశుద్దాత్మ నడిపింపు మనలో ఎలాంటి దైవ లక్షణాలను పెపొందిస్తుందో ఒక ఉదాహరణ చూద్దాం.

ఫిలిప్పీలో ప్రకటనా పని చేస్తున్నప్పుడు పౌలును, సీలను బంధించి, చితకబాది ఆ తర్వాత లోపలి చెరసాలలో వేశారు. అక్కడ వారి కాళ్లకు బొండ వేసి బిగించారు. ఆ సమయంలో చెరసాల నాయకుడు కూడా వారితో క్రూరంగా వ్యవహరించాడు. భూకంపం వచ్చి అనుకోకుండా చెరసాల తలుపులు తెరుచుకున్నప్పుడు, ఆ చెరసాల నాయకునిపై పగ తీర్చుకోవడానికి తమకు అవకాశం దొరికిందని పౌలు సీలలు అనుకున్నారా? లేదు. వారు తమలో ఆత్మఫలం వలన కలిగిన దేవుని లక్షణాలను అక్కడ ప్రదర్శించారు.

నిజమైన శ్రద్ధతో, స్వయంత్యాగపూరిత ప్రేమతో వెంటనే చర్య తీసుకున్నారు. దానివల్ల ఆ చెరసాల నాయకుడూ ఆయన ఇంటివారు విశ్వాసులయ్యారు. (అపొ. 16:19-34)

పౌలు సీలల్లా మన కూడా ‘హింసించేవారిని దీవించే’ విధంగా ప్రవర్తిస్తున్నామా? ఆ ప్రేమను, ఆ ఆనందాన్ని మనం ఇతరుల యెడల చూపిస్తున్నామా?

రోమా. 12:14. మిమ్మును హింసించువారిని దీవించుడి; దీవించుడి గాని శపింపవద్దు.

అటువంటి దైవ లక్షణాలతో కూడిన జీవితంలో ఎంతో ఆనందాన్ని మనం పొందుకొనగలం. ఆత్మ ఫలము ద్వారా ఎంతో ప్రతికూల పరిస్థితులలో కూడా వాక్యానుసారంగా ఉండగలం జీవితంలో ఎదురవుతున్న శ్రమల్లో శోధనలలో కూడా *ఆనందంగా* ఉండగలం.

ప్రపంచవ్యాప్తంగా అనేక మంది దేవుని బిడ్డలు ‘పరిశుద్ధాత్మ వల్ల కలిగే ఆనందంతో గొప్ప ఉపద్రవంలో’ కూడా ‘వాక్యాన్ని అంగీకరించారు.’

(1 థెస్స. 1:6పరిశుద్ధాత్మవలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము నంగీకరించి, మమ్మును ప్రభువును పోలి నడుచుకొనినవారైతిరి.)

మరి కొంతమంది సహోదరులు ఎన్నో కష్టనష్టాలను అనుభవిస్తున్నారు. అయినా వారు, “ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు” దేవుడు వారికి తన పరిశుద్ధాత్మను ఇచ్చి బలపరుస్తున్నాడు.

పరిశుద్దాత్మ నడిపింపు మనలో ఎలాంటి దైవ లక్షణాలను పెపొందిస్తుందో మరొక ఉదాహరణ చూద్దాం.

మనం మొదటి శతాబ్దంలోని అపొస్తలుడైన పేతురు ఉదాహరణను పరిశీలిద్దాం. సున్నతి పొందని అన్యులను తానెలా చూసేవాడో ఆయన మాటల్లోనే తెలుస్తుంది. ఆయనిలా అన్నాడు: “అన్యజాతివానితో సహవాసము చేయుటయైనను, అట్టివానిని ముట్టుకొనుటయైనను యూదునికి ధర్మముకాదని మీకు తెలియును. అయితే ఏ మనుష్యుడును నిషేధింప దగినవాడనియైనను అపవిత్రుడనియైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి యున్నాడు.” (అపొ. 10:24-29; 11:1-3)

కేవలం తోటి యూదులను మాత్రమే ప్రేమించమని ధర్మశాస్త్రం చెబుతోందనే నమ్మకం ఆ కాలంలోని వారికి ఉండేది. పేతురుకు కూడా చిన్నప్పటి నుండి ఆ అభిప్రాయమే ఉండవచ్చు. అందుకే, అన్యులను శత్రువులుగా ఎంచుతూ వారిని ద్వేషించడం తప్పేమీ కాదని ఆయన అనుకొన్నాడు.

తాను కొర్నేలి ఇంట్లోకి ప్రవేశిస్తున్నప్పుడు పేతురు ఎంత ఇబ్బందిపడి ఉంటాడో ఒక్కసారి ఆలోచించండి. అన్యుల విషయంలో సదభిప్రాయం లేని వ్యక్తి ‘సమాధానమనే బంధం  చేత’ ఎప్పటికైనా వారితో “చక్కగా” కలిసిపోవడం సాధ్యమేనా? (ఎఫె. 4:1, 16) సాధ్యమే.

ఎందుకంటే అప్పటికి కొన్ని రోజుల క్రితమే పరిశుద్దాత్మ ఆత్మచే పేతురు హృదయం తెరువబడినది. దానివల్ల ఆయన తన అభిప్రాయాన్ని మార్చుకొని, దురభిమానాన్ని తీసేసుకోగలిగాడు. జాతి, తెగ అనే భేదం లేకుండా ప్రజలతో వ్యవహరిస్తానని దేవుడు ఓ దర్శనంలో పేతురుకు స్పష్టం చేశాడు. (అపొ. 10:10-15)

అందుకే, “దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి యున్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును” అని పేతురు కొర్నేలితో చెప్పగలిగాడు. (అపొ. 10:34, 35)

పేతురు మారాడు, ప్రపంచవ్యాప్తంగా  జాతి మత కుల రహితంగా ‘సహోదరులతో’ నిజంగా కలిసిపోయాడు.—1 పేతు. 2:17. హలేల్లూయ!

ఉన్న జీవితం ఒక్కటే, మరప్పుడు మనం సాతాను లక్షణాలతో ఎందుకు జీవించాలి, దేవుని లక్షణాలతో జీవించి బ్రతుకు ధన్యం చేసుకోలేమా?

మనం దేవుని కుమారులుగా పరిశుద్ధాత్మ ఫలంలోని లక్షణాల్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని మనకు అనిపిస్తే పరిశుద్ధాత్మ నడిపింపును అనుసరించడానికి మరింతగా ప్రయత్నించాలి. అందుకోసం  వాక్యాన్ని ఉపయోగించి ఆత్మ ఫలంలోని లక్షణాల్లో ఒక్కోదాని గురించి అధ్యయనం చేయాలి. అలాచేస్తే, మన దైనందిన జీవితంలో ఆ లక్షణాలను ఎలా చూపించవచ్చో తెలుసుకోగలుగుతాం, అప్పుడు ఆ లక్షణాలను మరింత బాగా చూపించేందుకు కృషి చేయగలుగుతాం. పరిశుద్ధాత్మ మన జీవితంలో, తోటి క్రైస్తవుల జీవితాల్లో పని చేయడం వల్ల వచ్చిన ఫలితాలను మనం గమనిస్తే మనమెందుకు ఆ ఆత్మ ద్వారా నడిపించబడాలో స్పష్టంగా అర్థమవుతుంది.

(B)

*పరిశుద్ధాత్మ నడిపింపు*

యోహాను 3:5  యేసు ఇట్లనెనుఒకడు నీటిమూలముగాను ఆత్మమూలము గాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింప లేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

*B. పరిశుద్ధాత్మ నడిపింపును పొందుకునే విధానాలు:* ఈ రోజుల్లో కూడా పరిశుద్ధాత్మ నడిపింపుకు లోబడడానికి ఇష్టపడేవాళ్ళ మనసులపై, హృదయాలపై దేవుని ఆత్మ పనిచేసి వాళ్ళను ముందుకు నడిపించడం జరుగుతుంది. పరిశుద్దాత్ముడు మనల్ని సరైన దిశలో నడిపించేందుకు అవసరమైన కొన్ని విధానాలు పరిశుద్ధ గ్రంధంలో వ్రాయబడి ఉన్నాయి. కేవలం ఆ విధానాల ద్వారా మాత్రమే మనం పరిశుద్దాత్ముని నడిపింపును పొందుకొగలం. అయితే ముందుగా మనం ముందుగా దేవుని ఆత్మకు లోబడాలి. దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహించి, ఆ *ఆత్మ నడిపింపుకు లోబడేలా* సహాయం చేయమని ప్రభువుకు ఎల్లప్పుడూ ప్రార్ధించాలి.

(ఎఫెసీ 3:15 మీరు అంతరంగ పురుషునియందు శక్తికలిగి *ఆయన ఆత్మ వలన బలపరచ బడునట్లుగాను*.)

దేవుని ఆత్మకు లోబడాలంటే ముందుగా మనం దేవుని వాక్యానికి లోబడాలి. పరిశుద్ధాత్మ సహాయంతో రాయబడిన దేవుని వాక్యమైన బైబిలును ధ్యానించడం ద్వారా దాని నడిపింపుకు లోబడగలం. ఎందుకనగా దేవుని వాక్యం ఆత్మద్వార మనలను సరిచేయుటకు అనగా ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది.

(2 తిమో. 3:16, 17 దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది.)

దేవుని ఆత్మఇచ్చే జ్ఞానవంతమైన సూచనలను పాటిస్తూ, పరిశుద్ధాత్మ నడిపింపుకు లోబడాలి. ఈ దుష్టలోకంలో సరైన విధంగా నడిపించేందుకు పరిశుద్దాత్మ దేవునికి  శక్తి ఉ౦దని నమ్మకం కలిగివుండాలి.

పరిశుద్ధాత్మ నడిపింపును పొందుకునేందుకు పరిశుద్ధ గ్రంధంలో ఏడు విధానాలు చూడ గలం. అవి వరుసగా ధ్యానం చేద్దాం.

*B1. పరిశుద్ధాత్మ నడిపింపును పొందుకునే మొదటి విధానం: నీటి బాప్తీస్మం*  యోహాను 3:5 హృదయ పూర్వకంగా దేవుని కుమారుడైన యేసును స్వంత రక్షకునిగా అంగీకరించి దేవునికి మనం ఇచ్చే హృదయ సమర్పణకు సూచనగా నిజక్రైస్తవులు నీటి బాప్తిస్మం తీసుకుంటారు.

పరలోక పిలుపు అందుకున్నవారు నీటి బాప్తిస్మం తీసుకుంటారు. వారే కాక నేడు, భూమ్మీద నిరంతరం జీవించే స్త్రీ పురుషులు అందరు కూడా నీటి బాప్తిస్మం తీసుకోవాల్సిందే.

బాప్తిస్మం అను పదము గ్రీకు భాషలో బాప్టిజో (βαπτίζω - baptizó)  అను పదము ద్వార నిర్వచించబడింది. బాప్టిజో అనగా పాతి పెట్టుట, ముంచుట. బాప్తిస్మం గురించి రోమా 6:3లో యేసు లోనికి బాప్తిస్మం పొందిన మనమందరము “అయన మరణములోనికి” బాప్తిస్మం పొందితిరని మీరు ఎరుగరా? రోమా 6:4 లో మనము బాప్తీస్మం వలన మరణములో పాలుపొందుటకై ఆయనతో కూడా “పాతిపెట్టబడితిమి”. ఇది బాప్తీస్మం యొక్క అర్థము. బాప్తీస్మం ద్వారా పాతిపెట్ట బడుతున్నాము.

యేసు క్రీస్తు యొక్క మరణానికి సాదృశ్యముగా మనమందరము బాప్తీస్మం ద్వారా పాతిపెట్టబడు తున్నాము.

ఒక వ్యక్తికి ఏ నిరీక్షణవున్నా ఆయన దేవుని ఆమోదాన్ని పొందాలంటే తండ్రి నామంలో, కుమారుని నామంలో, పరిశుద్ధాత్మ నామంలో నీటి బాప్తిస్మం తీసుకోవాలి. అలా బాప్తిస్మం తీసుకున్న క్రైస్తవులందరూ ‘ఆత్మానుసారముగా నడుస్తూ’ ఉండాలి.

(గలతీయులు 5:16. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచు కొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు.)

నీటి బాప్తిస్మము ద్వారా ఒక వ్యక్తి తన విశ్వాసమును మరియు శిష్యరికమును బహిరంగంగా ఒప్పుకుంటాడు. బాప్తిస్మమనునది విశ్వసి జీవితంలో అంతరంగ పరివర్తనకు బాహ్య సాక్ష్యము. క్రైస్తవ బాప్తిస్మము మన జీవితాన్ని సంస్కరించు ఒక పరిశుద్ధ సంస్కారమై యున్నది. రక్షణ తరువాత ప్రభువునకు విధేయత చూపు కార్యము.

ఈ పరిశుద్ధ బాప్తీస్మ సంస్కారంలో 1) ఒక వ్యక్తి ప్రభువైన యేసు వాక్యం ద్వార విశ్వాసముంచుతాడు, మరియు 2) తరువాత అతడు బాప్తిస్మము పొందుతాడు.

అపొ. 2:41లో ఈ వరుస చూడవచ్చు, “కాబట్టి అతని వాక్యము అంగీకరించినవారు బాప్తిస్మము పొందిరి”

(అపొ. 16:14–15 అప్పుడు లూదియయను దైవభక్తిగల యొక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచెను 15  ఆమెయు ఆమె యింటివారును బాప్తిస్మము పొందినప్పుడు, ఆమె -- నేను ప్రభువునందు విశ్వాసము గలదాననని మీరు యెంచితే, నా యింటికి వచ్చియుండు డని వేడుకొని మమ్మును బలవంతము చేసెను).

ప్రభువైన యేసు కూడా యోహాను దగ్గర బాప్తిస్మం తీసుకున్నట్లుగా మనం చూడగలం. యేసు తనకు బాప్తిస్మమివ్వవలెనని యోహానును అడిగినప్పుడు అందుకు యోహాను వెంటనే అభ్యంతరము తెల్పుచు “నేను నీచేత బాప్తిస్మము పొందవలసిన వాడనై యుండగా నీవు నాయొద్దకు వచ్చుచున్నావా?” అని అన్నాడు.  తానిచ్చు బాప్తిస్మము యేసుకొరకు కాదనియు యోహానుకు తెలుసు. అది తమ పాపముల విషయమై పశ్చాత్తాపము పొందినవారి కొరకే, అయితే

యేసు పాపము లేనివాడు. అయినను, యోహాను నివారించుచున్నను, యేసు ఆయననిట్లు బలవంతపెట్టెను: “ఇప్పటికి కానిమ్ము; నీతియావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నది.”

యేసు బాప్తిస్మము తీసికొనుట ఎందుకు సరియైయున్నది? ఎందుకనగా యేసు తీసికొనే బాప్తిస్మము పాపముల విషయమై పశ్చాత్తాపము నొందుటకు కాదుగాని, తన తండ్రి చిత్తము నెరవేర్చుటకు తనను తాను సమర్పించుకొనుటకు అది చిహ్నమై యున్నది. అయితే ఇప్పుడు యెహోవా దేవుడు తనను భూమికి దేనిని చేయుటకు పంపెనో ఆ పరిచర్యను ప్రారంభించుటకు సమయము వచ్చినది. యేసుకు బాప్తిస్మమిచ్చు నప్పుడు అసాధారణమైనది జరిగినది.

యోహాను ఆ తర్వాత ఇట్లనుచున్నాడు: “నీళ్లలో బాప్తిస్మమిచ్చుటకు నన్ను పంపినవాడు, *‘నీవెవనివిూద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చువాడని’* నాతో చెప్పెను.”

కాబట్టి తాను బాప్తిస్మమిచ్చు వారిలో ఒకరివిూదకు దేవుని ఆత్మ వచ్చునని యోహాను ఎదురుచూచుచుండెను. అందుకే బహుశ, యేసు నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చినప్పుడు, “దేవుని ఆత్మ పావురమువలె దిగి ఆయన విూదికి వచ్చుటను” యోహాను చూచినప్పుడు తాను నిజముగా ఆశ్చర్యపడలేదు.

అయితే యేసు బాప్తిస్మము తీసికొనుచుండగా దానికంటే ఎక్కువ సంభవించెను. ‘ఆయనకు పైగా ఆకాశము తెరవబడెను.’

దీని భావమేమనగా స్పష్టముగా దీని భావమేమనగా ఆయన బాప్తిస్మము పొందుచుండగా, పరలోకమందలి తన పూర్వ జీవితము ఆయనకు జ్ఞాపకము వచ్చెను. ఆ విధముగా యేసు తన పూర్వ ఉనికినందు పరలోకములో దేవుడు తనతో మాట్లాడిన సంగతులన్నిటితో సహా, యెహోవా దేవుని ఆత్మీయ కుమారునిగా తన జీవితమునుగూర్చి ఇప్పుడు పూర్తిగా జ్ఞాపకము చేసికొనుచున్నాడు. ఇది ఆయన బహిరంగ పరిచర్యకు ఆత్మ ద్వార ప్రారంభం.

ఈ బాప్తిస్మ సంస్కరణ ద్వారానే ఒక వ్యక్తి సంఘ సహవాసం లోనికి చేర్చబడతాడు. మనం రక్షణ పొందినప్పుడు, ఆత్మ ద్వారా మనం సంఘమైన క్రీస్తు శరీరంలోనికి “బాప్తిస్మము” పొందితిమి.

యేసు క్రీస్తులో నూతన విశ్వాసి వీలైనంత త్వరగా బాప్తిస్మము పొందుటకు ఆశించాలి. అపొ. 8లో ఐతియోపియాకు చెందిన నపుంసకునితో “యేసును గూర్చిన సువార్తను” మాట్లాడతాడు “వారు త్రోవలో వెళ్లుచుండగా నీళ్లున్న యొక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడుఇదిగో నీళ్లు; నాకు బాప్తిస్మమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను”
(వచ 35–36). వెంటనే, వారు రథమును ఆపారు, మరియు ఫిలిప్పు ఆ వ్యక్తికి బాప్తిస్మము ఇచ్చాడు. 

బాప్తిస్మము క్రీస్తు యొక్క మరణం, సమాధి, మరియు పునరుత్థానముతో విశ్వాసి యొక్క గుర్తింపు. సువార్త ప్రకటించబడి ప్రజలు క్రీస్తులో విశ్వాసములోనికి నడిపించబడిన ప్రతి చోట, వారు బాప్తిస్మము పొందవలెను. మానవుని జీవితంలో పరిశుద్ధాత్మ నిర్దేశకత్వం బాప్తిస్మం ద్వారా ప్రారంభం అవుతుంది.

*పరిశుద్ధాత్మ నడిపింపు*

*పరిశుద్ధాత్మలో బాప్తిస్మం*

అపో 1:5  యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు *పరిశుద్ధాత్మలో బాప్తిస్మము* పొందెద రనెను.

*B2. పరిశుద్ధాత్మ నడిపింపును పొందుకునే రెండవ విధానం: పరిశుద్ధాత్మ బాప్తిస్మం*   పాత నిబంధనలో ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మం లేదు కాని క్రొత్త నిబంధనలో మాత్రమే ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మం వుంది. ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మం పాత నిబంధన విశ్వాసులకు సంబంధించినది కాదు కాని వారికి లేని గొప్ప భాగ్యం దేవుడు క్రొత్తనిబంధన విశ్వాసులకు ఇవ్వడం జరిగింది.  1 కొరింథీ. 12:12 “మనమందరము ఒక్క శరీరములోనికి *ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితివిు.*

పరిశుద్ధాత్మ బాప్తిస్మము, బాప్తిస్మమిచ్చు యోహాను ద్వారా (మార్కు 1:8) మరియు పరలోకమునకు ఆరోహణ అగుటకు ముందు యేసు ద్వారా ప్రవచించబడెను: “యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు *పరిశుద్ధాత్మలో బాప్తిస్మము* పొందెదరనెను” (అపొ. 1:5). ఈ వాగ్దానము పెంతెకొస్తు దినమున నెరవేరింది (అపొ. 2:1-4);

ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మమునకు గల మరియొక పేరు *అగ్ని బాప్తిస్మం.* మత్తయి 3:11  మారుమనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మ మిచ్చుచున్నాను; అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటె శక్తిమంతుడు; ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను; ఆయన *పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును.* మార్కు 1:8, లూక 3:16, యోహాను1:33,

అపోస్తలుల కార్యములు 2:3  మరియు అగ్నిజ్వాలలవంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగ  అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్‌శక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి.

మొదటిసారిగా, పరిశుద్ధాత్మ ప్రజల జీవితాలలో స్థిరముగా నివసించుట ఆరంభించెను, మరియు సంఘము ఆరంభించబడెను.
ఆనాడు పేతురు మేడగదిలో పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మం పొందిన తరువాత ఆయన సాక్ష్యం ఈ విధంగా చెప్పాడు. "అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిస్మమిచ్చెను గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తి స్మము పొందుదురని ప్రభువు చెప్పినమాట నేను జ్ఞాపకము చేసికొంటిని." అపో.కా 11:16

ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మం  గురించి నాలుగు  సువార్తలలోను మరియు అపో.కా1:4,5.లో ప్రవచన రీతిలో చెప్పబడినవి
ఆ తరువాత అపో.కా 2:3, 11:15,16లో ఆ ప్రవచన నెరవేర్పు జరిగినట్లుగా మనం చూడగలం.

పరిశుద్ధాత్మలో బాప్తిస్మము మేడ గదిలో జరిగినది. అనగా మేడగది సంఘమునకు సాద్రుశ్యంగా ఉన్నది. నీటి బాప్తిస్మం ద్వారా రక్షణ పొందుకున్న విశ్వాసి ఆ తరువాత ఎక్కడెక్కడో తిరిగితే పరిశుద్ధాత్మ బాప్తిస్మం జరగదు. సంఘంలోనికి రావాలి. అప్పుడే దహించు అగ్నియైన వాక్య రూపంలో పరిశుద్ధాత్మ విశ్వాసుల మీద కుమ్మరించబడగలదు. దేవుని మాటలే అగ్ని. దేవుని వాక్యానికి లోబడినవారికే పరిశుద్దాత్మ అను వరం వాగ్దానం చేయబడినది అని మనం గమనించాలి. ఎఫే 1:13  మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వాసముంచి, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి.

పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మం అంటే ఏదో అగ్ని దిగినట్లుగా అక్షరార్ధంగా కాదుకాని దహించు అగ్నియైన వాక్యం రూపంలో పరిశుద్ధాత్మ విశ్వాసుల హృదయాలను ఆవరించి కార్యాలను జరిగించి ఐక్యతలోని నడుపుతాడు. అనగా రక్షణ పొందిన క్షణమున విశ్వాసిని క్రీస్తుతోను మరియు క్రీస్తు శరీరములోని ఇతర విశ్వాసులతోను ఐక్యతలోనికి నడుపు దేవుని ఆత్మ యొక్క కార్యముగా ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మమును నిర్వచించవచ్చు.

బైబిల్ లో 1 కొరింథీ. 12:12–13 పరిశుద్ధాత్మ బాప్తిస్మమునకు మూల వాక్యభాగము: “ఏలాగనగా, యూదులమైనను, గ్రీసుదేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి *ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితివిు.* మనమందరము ఒక్క ఆత్మను పానము చేసినవారమైతివిు” 1 కొరింథీ. 12:13.

చాలామందికి పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి రకరకాల అపోహలు ఉన్నాయి. అది కేవలం కొంతమందికే అని వారి భావం. కాని వాక్యంలో చూస్తే, *“మనమంతా”* ఆత్మ ద్వారా బాప్తిస్మము పొందితిమనే మాటలు గమనించండి. రక్షణకు తోడుగా, అందరు పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందారు, మరియు ఇది కేవలం కొంత మందికే కలుగు విశేష అనుభవము కాదు.

ఆత్మ బాప్తిస్మమును గూర్చి మన అవగాహనను బలపరచుటకు సహాయంచేయుటలో ఈ క్రింది సత్యములు అవసరము:

మొదటిగా, అందరికి త్రాగుటకు ఆత్మ ఇవ్వబడినట్లు (ఆత్మ మనలో నివసించుట), అందరు బాప్తిస్మము పొందితిరని 1 కొరింథీ. 12:13 స్పష్టముగా చెబుతుంది.

రెండవదిగా, పరిశుద్ధాత్మ బాప్తిస్మమును వెదకుట కొరకు ఆత్మతో, ఆత్మలో, లేక ఆత్మద్వారా విశ్వాసులు బాప్తిస్మము పొందాలని లేఖనములో ఎక్కడా ఇవ్వబడలేదు. అనగా విశ్వాసులందరు ఇట్టి అనుభవం కలిగియున్నారని ఇది సూచిస్తుంది.

మూడవదిగా, (ఎఫెసీ. 4:5 ప్రభువు ఒక్కడే, విశ్వాస మొక్కటే, బాప్తిస్మ మొక్కటే,) ఈ వాక్యం ఆత్మ బాప్తిస్మమును సూచిస్తున్నట్లు అనిపిస్తుంది.

అలా అయినయెడల, ఆత్మ బాప్తిస్మము ప్రతి విశ్వాసికి ఒక వాస్తవికత, “ఒకే విశ్వాసం” మరియు “ఒకే తండ్రి”లాగా.

ఎఫెసీ 4:5లో వలె ఒకే ఆత్మ బాప్తిస్మమును అనుభవించుట సంఘము యొక్క ఐక్యతను బలపరచుటకు సహాయ పడుతుంది. ఆత్మ బాప్తిస్మము ద్వారా క్రీస్తు మరణం, సమాధి, మరియు పునరుత్థానములో ఆయనతో సహవాసము కలిగియుండుట, మనలో ఉన్న పాపము నుండి విడిపోవుటకు మరియు మన నూతన జీవిత నడకకు పునాదిని నిర్మిస్తుంది (రోమా. 6:1-10; కొలస్సి. 2:12).

ఉదా: యేసు శిష్యులు క్రీ.శ. 33 పెంతెకొస్తు రోజున పరిశుద్ధాత్మలో బాప్తిస్మం తీసుకున్నారు. అలా బాప్తిస్మం తీసుకున్న తర్వాతే వారు అన్య భాషల్లో మాట్లాడారు. వారు అద్భుతమైన ఆత్మవరాలు పొందడం  వల్ల ఎన్నో కార్యాలు చేశారు. (1 కొరిం. 12:4-10)
వాటిని చూసి, అపొస్తలుడైన పేతురు ప్రసంగాన్ని విన్న తర్వాత ప్రజలు ఎలా స్పందించారు? చాలామంది *‘హృదయంలో నొచ్చుకున్నారు.’* పేతురు ప్రోత్సాహంతో వారు పశ్చాత్తాపపడి బాప్తిస్మం తీసుకున్నారు. అప్పుడు ఏమి జరిగిందో బైబిలు చెబుతోంది: “అతని వాక్యము అంగీకరించినవారు బాప్తిస్మము పొందిరి; ఆ దినమందు ఇంచుమించు మూడు వేలమంది చేర్చబడిరి.” (అపొ. 2:22, 36-41)  

అందుకే నమ్మి నీటి బాప్తిస్మం తీసుకోవాలి. అప్పుడే వారు   సంఘంలో చేర్చబడి పరిశుద్దాత్మ అగ్ని బాప్తిస్మం ద్వార క్రీస్తు శరీరంలో ఐక్యపరచబడగలరు. అలా కాకుండా కేవలం పెండ్లిండ్ల కొరకు సర్టిఫికెట్ల కొరకు నీటి బాప్తిస్మం తీసుకొంటే వారిమీదకు పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మం రాదు.

అయితే దహించు దేవుని అగ్ని వారిమీదకు వేరే రూపంలో రాగలదు. అదే భయంకరమైన అగ్ని గుండం. ప్రకటన గ్రంధం 21:8 లో బైబిల్ గ్రంథం ఈవిధంగా సెలవిస్తున్నది, “పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రికులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండే గుండములో పాలు పొందుదురు, ఇది రెండవ మరణము.”

ఆత్మ బాప్తిస్మం ద్వార ఆత్మతో నింపబడి మనం క్రమక్రమంగా ఆత్మ పూర్ణులం కాగలం. ఎఫె 5:18 మరియు మద్యముతో మత్తులైయుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు; అయితే ఆత్మపూర్ణులై యుండుడి.

సాతానుడు శరీర సుఖాలనే మత్తును కలుగజేసి మనలను దేవునికి దూరం చేస్తున్నాడు. దానిని మనం గ్రహించి ఆత్మ బాప్తిస్మం ద్వార  దహించు అగ్నియైన వాక్య రూపంలోని ఆత్మతో నింపబడి క్రమంగా మనం ఆత్మ పూర్ణులమైనప్పుడు మన జీవితాలన్ని అగ్నితో మండుచూ పూర్తిగా దేవునికి అనుకూలముగా మార్చబడగలవు. అట్టి కృపను దేవుడు మనకు సమృద్ధిగా దయచేయును గాక!  ఆమేన్!!

కామెంట్‌లు